Telangana | 1 Lakh For BCs: తెలంగాణలోని కులవృత్తులు చేసుకునే బీసీలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు వారికోసం మరో కొత్త పథకాన్ని ఈనెల 9న ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా కులవృత్తులు చేసుకునే వారికి ఒక్కో కుటుంబంలో ఒక్కరికి చొప్పున రూ.లక్ష చొప్పున సాయం అందించనున్నారు. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, శాలివాహన, కమ్మరి, మేదరి తదితర కులవృత్తుల వారిని ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి ప్రభుత్వపరంగా రూ.లక్ష సాయం అందించనున్నారు. ఈ పథకం కోసం కొందరి సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఈ ఉపసంఘం తాజాగా దీనికి సంబంధించి విధివిధానాలను ఖరారు చేసింది. అసలు ఈ పథకానికి అర్హులు ఎవరు? నగదు ఎలా అందుతుంది? ఆ నగదును ఏం చేయాలి? ఇలా అనేక అంశాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పూర్తి వివరాలివే..
ఒక్క కుటుంబంలో ఎంతమందికి రూ.లక్ష సాయం అందిస్తారు?
ఒక్క కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రూ.లక్ష సాయాన్ని అందిస్తారు
ఏ వయస్సు వారు అర్హులు?
జూన్ 2 2023 వరకు 18 నుంచి 55 ఏళ్లు గల వారు మాత్రమే అర్హులు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. https://tsobmms.cgg.gov.in/ ఈ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.
వార్షిక ఆదాయం ఎంత ఉండాలి?
గ్రామీణ ప్రాంతాల వారి వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల లోపు ఉండాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారి వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి.
అర్హులు కానిది ఎవరు?
గత 5 ఏళ్ల నుంచి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.50 వేల కంటే ఎక్కువ లబ్ది పొందిన వారు అనర్హులుగా పరిగణిస్తారు.
దరఖాస్తు ప్రారంభం, చివరి తేదీలు ఎప్పుడు?
ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోడానికి జూన్ 6 నుంచి జూన్ 20 వరకు అవకాశం కల్పించారు.
దరఖాస్తు పరిశీలన ఎప్పుడు?
అప్లై చేసుకున్న వారి దరఖాస్తులను మండల మున్సిపాలిటి స్థాయిలో అధికారులు జూన్ 20 నుంచి జూన్ 26 వరకు పరిశీలిస్తారు. ఆ తరువాత కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడే సెలెక్షన్ కమిటీ వెరిఫికేషన్ చేసి లబ్ధిదారుల ఎంపికను ఫైనల్ చేస్తారు. ఆ తరువాత జూన్ 27 నుంచి ఇంఛార్జి మంత్రుల ఆమోదంతో జులై 4 వరకు లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసి ఆయా గ్రామ, మండల స్థాయిల్లో, వెబ్ సైట్ లో లిస్టులను ప్రదర్శిస్తారు.
వన్ టైమ్ బెనిఫిట్ గా నిధులు
ఇక ఎంపికైన లబ్దిదారులకు ప్రతి నెల 15న వన్ టైమ్ బెనిఫిట్ గా ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది.
వారికే పూర్తి స్వేచ్ఛ
అయితే వచ్చిన డబ్బును లబ్ధిదారుడు తన ఇష్టం మేరకు ఎలాంటి ఉపకారణాలైన కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది.
ఆర్ధిక సాయం అందిన తరువాత నెల రోజుల్లోనే యూనిట్లను గ్రౌండింగ్ చేసుకునేలా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
ఇక ఆ తరువాత కలెక్టర్ అపాయింట్ మెంట్ చేసిన స్పెషల్ ఆఫీసర్ లేదా ఎంపీడీవో లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను పరిశీలిస్తారు.
2 ఏళ్ల వరకు ప్రతి 3 నెలలకు ఒకసారి స్పెషల్ ఆఫీసర్ ఆ యూనిట్లను పరిశిలిస్తారు. లబ్దిదారులకు ఈ సందర్బంగా కీలక సలహాలు, సూచనలు ఇస్తారు.