Sunday, 19 April 2020

PMFBY

Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY) : 
పంటలపై ఇప్పటివరకూ బీమా తప్పనిసరి అనే కండీషన్ ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం... కొత్తగా బీమా తప్పనిసరి అనే కండీషన్‌ను పక్కన పెట్టింది. ఇకపై రైతులు బీమా చెయ్యాలా వద్దా అనేది రైతులే నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పంట రుణాలపై గానీ లేదా కొత్తగా తీసుకునే రుణాలపై గానీ బీమా సదుపాయాన్ని పొందవచ్చు అని కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పంట బీమా పథకాల అమలుపై రైతు సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నాళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో... కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం పంట రుణం తీసుకున్న రైతులు PMFBY పథకం కింద తప్పకుండా బీమా చేయించాలి. విత్తనాలు వేయక ముందు నుంచి కోత కోసేంత వరకు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు PMFBY కింద ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్నారు. వానాకాలం పంటలకు 2 శాతం, యాసంగి పంటలకు 1.5 శాతం,... ఉద్యానవనాలు, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున ప్రీమియం చెల్లించాలనే కండీషన్ ఉండేది. ఇకపై ఇన్సూరెన్స్ ఉండాలా వద్దా అనేది రైతులే నిర్ణయించుకోవచ్చు. బీమా కావాలంటే ప్రీమియం చెల్లించాలి. అక్కర్లేదనుకుంటే ప్రీమియం చెల్లించాల్సిన పనిలేదు.

2016లో మోదీ ఈ ఫసల్ బీమా పథకాన్ని ప్రారంభించారు. దీని వల్ల దేశంలో 30 శాతం వ్యవసాయ భూమి బీమా కిందకు వచ్చింది. మొత్తం రూ.13000 కోట్ల ప్రీమియం వసూలు కాగా... రూ.60వేల కోట్ల ప్రీమియం చెల్లించారు. ఎందుకంటే మన దేశంలో చిన్న, సన్నకారు రైతులు ఎక్కువ. వాళ్లలో చాలా మంది పంటలు నష్టపోతున్నారు. అప్పుల పాలవుతున్నారు. వాళ్లకు ఈ స్కీం అనుకూలంగా ఉండేది. ఇందులో రైతులకు అదనపు బెనెఫిట్ ఏంటంటే... చాలా తక్కువ ప్రీమియం చెల్లించి... ఎక్కువ మనీ పొందే అవకాశం ఉంటుంది. రైతు చెల్లించిన ప్రీమియంతోపాటూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రీమియం చెల్లిస్తాయి. అందుకే దేశంలో కేంద్రం ఎక్కువ ఇన్సూరెన్స్ చెల్లించిన పథకంగా ఇది గుర్తింపు పొందింది.

బీమా స్కీం తీసుకొని ప్రీమియం చెల్లించే రైతులకు పొలంలో పంటకు నష్టం జరిగినా, విత్తులు నాట్లుగా అవ్వకపోయినా, పంట కోతకు వచ్చే సమయంలో నష్టం జరిగినా, బీమా వర్తిస్తోంది. వరదలు, విపత్తులకు కూడా వర్తిస్తోంది. పంట నష్టం జరిగినట్లు తెలియగానే... ప్రీమియం చెల్లించే రైతు బ్యాంక్ అకౌంట్‌లో... బీమా మొత్తంలో ముందుగా 25 శాతం చెల్లిస్తున్నారు.

బ్యాంక్ ద్వారా రుణాలు తీసుకునే రైతులకు అదే బ్యాంక్ ద్వారా పంట బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ఒకవేళ బ్యాంక్ ద్వారా రుణాలు తీసుకోని రైతులకు... మీ సేవా, బీమా కంపెనీల ద్వారా ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్నారు. ఐతే... ఇప్పుడు ఇది ఐచ్ఛికం అయ్యింది కాబట్టి... తమ పంటలకు బీమా ఉండాలో, వద్దో రైతులే నిర్ణయించుకోవచ్చు.

No comments:

Post a Comment