రైతు బీమా' పథకం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'రైతు బీమా' పథకం సోమవారం (ఆగస్టు 6) రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
వరంగల్ రూరల్ జిల్లా, దుగ్గొండి మండలం, తిమ్మంపేట గ్రామంలో 'రైతుబీమా'
పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు బీమా బాండ్లను
అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆయన
కుటుంబం రోడ్డున పడకూడదన్న గొప్ప ఉద్దేశ్యంతో సిఎం కేసిఆర్ రైతు బీమా
పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు.భూరికార్డుల ప్రక్షాళన ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలున్న ప్రతి రైతుకు నేడు రైతు బీమా పథకం వర్తిస్తుందని కడియం అన్నారు. ఎకరం భూమి ఉన్న రైతు నుంచి వంద ఎకరాలున్న రైతుకు కూడా ఒకే రకమైన బీమా ఉంటుందన్నారు. ఒక్కో రైతు కోసం తెలంగాణ ప్రభుత్వం 2271 రూపాయలను ప్రీమియంగా చెల్లించి, 5 లక్షల రూపాయలను బీమాగా అందిస్తుందని కడియం అన్నారు.
13 వరకు బాండ్ల పంపిణీ
వ్యవసాయశాఖ అధికారులు ఆగస్టు 13 వరకు బీమా పత్రాలను రైతులకు అందజేస్తారు. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసు ఉన్న రైతులందరినీ.. ఈ పథకానికి అర్హులుగా ప్రకటించారు. దీనికింద మొత్తం 27లక్షల 416 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. ఇప్పటి వరకు 20 లక్షల 72 బీమా పత్రాలను ముద్రించి.. గ్రామాలకు పంపించారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులకు బాండ్లను అందజేస్తారు.
ఈ పథకం కింద ఇప్పటి వరకు 636 కోట్లను ప్రీమియంగా ఎల్‌ఐసీకి వ్యవసాయశాఖ చెల్లించింది. మొదట 500 కోట్లు కేటాయించగా.. అవి సరిపోవని భావించిన ఆర్థికశాఖ మరో 136 కోట్లను విడుదల చేసింది. అర్హులైన రైతులందరికీ.. 2018 ఆగస్ట్ 14 నుంచి 2019 ఆగస్ట్ 13 వరకు జీవిత బీమా వర్తించనుంది. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే.. నామినీకి 10 రోజుల్లోగా 5 లక్షల బీమా పరిహారం ఎల్ఐసీ నుంచి అందుతుంది.
No comments:
Post a Comment